న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీపి కబురు అందించింది. విదేశీ పెట్టుబడుల ద్వారా అణు విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ పడింది.
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
దేశంలో ఇప్పటికే పలు చోట్ల అణువిద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ ల లో ఈ అణు విద్యుత్తు కేంద్రాలు నడుస్తున్నాయి. భారత్ లో దాదాపు 6.72 గిగా వాట్ ఉత్పత్తి జరుగుతోంది.