హైదరాబాద్: నితిన్, కీర్తి సురేష్ జంటగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, అఖిల్ తో మజ్ను సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడు. అయితే కరోనా వల్ల షూటింగ్ కి బ్రేక్ పడిన ఈ సినిమా మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టింది. ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చెయ్యబోతున్నారు అనే రూమర్స్ ఈ మధ్య బాగానే వచ్చాయి. కానీ వీటికి చెక్ పెడుతూ ‘సంక్రాతి’ కి సినిమాని సిద్ధం చేయబోతున్నట్టు డైరెక్టర్ ట్వీట్ చేసారు.
నేటి నుండి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను షూట్ చేస్తున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సంక్రాంతికి అందరం కలుద్దాం అంటూ వెంకీ చేసిన ట్వీట్ తో సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఏడాది లోపే ‘రంగ్ దే’ సినిమాను విడుదల చేయబోతున్నాడు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే జులై 31వ తారీకున ఈ సినిమాను విడుదల చేసేవారు. కరోనా లాక్ డౌన్ తో మొత్తం ప్లానింగ్ తారు మారు అయ్యింది. ఇప్పటికి విడుదలైన ఈ సినిమా టీజర్ తర్వాత ఈ సినిమాపైన అంచనాలు బాగా పెరిగాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఛాయాగ్రహుకుడిగా పని చేయడం ప్రత్యేకత.