హైదరాబాద్: కరోనా టైం లో చాల మందికి సహాయం చేసి ఇంకా చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి ‘సోనూ సూద్‘. తెలుగులో చాలా సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో చేసి మెప్పించాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ‘అరుంధతి’, ‘ఏక్ నిరంజన్’. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు సోనూ సూద్. దీనికి సంబంధించి షూటింగ్ చేయడానికి ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు ఈ నటుడు.
సోనూ సూద్ ‘అల్లుడు అదుర్స్’ సెట్ కి రాగానే సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గొప్ప నటుడు అయిన ప్రకాష్ రాజ్ సోనూ సూద్ ని సత్కరించాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు ఆయన. అలాగే ఎవరు సహాయం అడిగినా లేదనుకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు.సినిమాల్లో విలన్గా కనిపించే సోనూ సూద్.. రియల్ లైఫ్లో మాత్రం అందరిచేతా హీరో అనిపించుకుంటూ ముందుకుపోతున్నాడు. అందుకే నటుడు ప్రకాష్ రాజ్, సోనూ సూద్ ను సన్మానించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో కలిసి ‘అల్లుడు అదుర్స్’ అనే మూవీ చేస్తున్నాడు. నూతన నిర్మాత సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీ గా నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, సత్య ,కాదంబరి కిరణ్ , చమ్మక్ చంద్ర, దువ్వాసి మోహన్ తదితరులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. 2021 సంక్రాంతి రేస్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.