fbpx
Thursday, November 28, 2024
HomeSportsసూపర్ ఓవర్, బెంగళూరు విన్నర్

సూపర్ ఓవర్, బెంగళూరు విన్నర్

BENGALURU-WON-IN-SUPER-OVER-MUMBAI

దుబాయ్‌: మ్యాచ్ మొత్తం సిక్స్‌లే సిక్స్‌లు! పరుగుల వరదే వరద!! బౌండరీ చిన్నదా అనిపించేంత, లేక బౌలింగే రాని బౌలర్లు వేస్తున్నారా అన్నంతగా మెరుపులు బెంగళూరు మరియు ముంబై మ్యాచులో అనిపించింది. పొదుపు బౌలింగ్‌ అనేది లేనేలేదు. గెలుపు ఖాయమనే అంచనాలు ఎవరూ వేయలేని పరిస్థితి. అలాంటి మ్యాచ్‌ ఐపీఎల్‌లో సోమవారం జరిగింది.

క్రికెట్‌ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో చివరకు సూపర్‌ ఓవరే ఫలితాన్నిచ్చింది. 201 పరుగులు చేసినా దక్కని విజయం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు (ఆర్‌సీబీ) ఆ ఒక్క సూపర్‌ ఓవర్‌తో దక్కింది. ముంబై ఇండియన్స్‌ పోరాటం ఆ ఒక్క ఓవర్‌లోనే ఆవిరైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయ్యింది. ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. పొలార్డ్‌ (24 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) వణికించాడు.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు రోహిత్‌ 6, డికాక్‌ 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఇక ఆరంభం అదిరిందిలే అనుకుంటుండగా వరుస ఓవర్లలో రోహిత్‌ శర్మ (8)ను సుందర్, సూర్యకుమార్‌ (0)ను ఉదాన అవుట్‌ చేయడం ముంబైని కష్టాల్లోకి నెట్టింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్‌ డికాక్‌ (14)ను చహల్‌ ఔట్‌ చేశాడు.

39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ సాగేకొద్దీ లక్ష్యానికి దూరమైంది. జట్టు స్కోరు 50 చేరేందుకే 7.5 ఓవర్లు ఆడింది. 14 ఓవర్లు ముగిసినా వందనే చేరలేదు. 98/4 స్కోరు చేయగా… ఇక మిగిలిన 6 ఓవర్లలో 103 పరుగులు కావాలి. దాదాపు కష్టసాధ్యం. క్రీజులో ఉన్న పొలార్డ్‌ కూడా అప్పటిదాకా పెద్దగా మెరిసిందేమి లేదు. ఇలాంటి స్థితిలో 17వ ఓవర్‌ ముంబై దశనే మార్చింది. 2 క్యాచ్‌లు నేలపాలు కావడంతో పొలార్డ్‌ ఓవర్‌ అసాంతం చితగ్గొట్టాడు. 4, 6, 6, 2, 6, 3 లతో మొత్తం 27 పరుగులు రావడంతో జట్టు స్కోరు అనూహ్యంగా 149/4కు చేరింది.

గత మ్యాచ్‌ (పంజాబ్, రాజస్తాన్‌) అనుభవం దృష్ట్యా ఇక 18 బంతుల్లో 53 పరుగులు కష్టంగా కనిపించలేదు. చహల్‌ 18వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదిన పొలార్డ్‌ 20 బంతుల్లోనే (2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. చహల్‌ కూడా 20 పైచిలుకు (22 పరుగులు) ఇవ్వడంతో ముంబై లక్ష్యానికి (12 బంతుల్లో 31 పరుగులు) దగ్గరైంది. 19వ ఓవర్‌లో నవదీప్‌ సైనీ 12 పరుగులిచ్చాడు. ముంబై ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ఉదాన వేసిన ఈ ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ 2 సిక్సర్లు కొట్టి ఔట్‌కాగా, ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి.

అయితే పొలార్డ్‌ ఫోర్‌ కొట్టడంతో స్కోరు 201తో సమమైంది. మ్యాచ్‌ ‘టై’ అయింది. విజేత కోసం సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. ఇక సూపర్ ఓవర్లో ముంబై 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. పోలార్డ్, హార్దిక్ లాంటి హిట్టర్లు వచ్చినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఇక బెంగళూరు వైపు డివిలియర్స్, కోహ్లీ ఆడి బెంగళూరు కు విజయాన్ని అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular