బాలీవుడ్: ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అంటే ఏ 50 ఏళ్లకో, 60 ఏళ్లకో అలా ఉంటుంది. కానీ క్రీడా రంగం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రాటి రంగాల్లో ముప్ఫైల్లోనే రిటైర్ అయ్యి వేరే దార్లు వెతుక్కోక తప్పదు. ఈ మధ్యనే రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ కూల్ ధోని కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టె ప్లాన్ లో ఉన్నాడు. కొందరు క్రికెటర్లు సినిమాల్లో నటిస్తుండగా, కొందరు క్రికెటర్స్ కామెంటరీ రంగాన్ని ఎంచుకోగా, కొందరు కోచ్ అవతారం ఎత్తగా, కొందరు స్కూల్స్ బిజినెస్ మొదలు పెట్టగా కొందరు ముందు నుండి రెస్టారెంట్ బిజినెస్ నడిపిస్తున్నారు. ధోని సినిమా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు తీసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధోని శ్రీమతి సాక్షి కూడా ధృవీకరించారు.
ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గతేడాది ‘రోర్ ఆఫ్ ది లయన్’ అనే డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మరిన్ని వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టులను నిర్మించటానికి ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ధోని భార్య సాక్షి సింగ్ వీటి గురించి సమాచారం అందించారు. ”వినోద రంగంలోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నాం.. ప్రతిభావంతులను మా బ్యానర్ ద్వారా ఎంకరేజ్ చేస్తాం. మంచి కథలను రూపొందించడమే మా లక్ష్యం. ఇప్పటికే ఓ ప్రముఖ పుస్తకం రైట్స్ తీసుకున్నాం. దానిని వెబ్ సిరీస్ గా తీసుకురాబోతున్నాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ” అని సాక్షి ప్రకటించారు.