హైదరాబాద్ : కరోనా వైరస్ దేశంలో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది. అయితే కరోనా భయం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం ఒక రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు, రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్‌రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన బెడ్‌రూంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్‌లో తెలిపారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు ఈ కేసును గురించి దర్యాప్తు చేస్తున్నారు.