కోలీవుడ్: నిన్న గాంధీ జయంతి ని పురస్కరించుకొని తెలుగులో ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘నిశ్శబ్దం’ సినిమాలతో పాటు తమిళ్ లో ‘కా పే రణసింగం’ అనే సినిమా విడుదలైంది. విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలుగా విరుమాండి అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా జీ 5 సినీప్లెస్ లో పే పర్ వ్యూ పద్దతిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమా చూసేంతవరకి విజయ్ సేతుపతి మార్కెట్ బేస్ చేసుకుని, విజయ్ సేతుపతి యాక్టింగ్ దృష్టిలో ఉంచుకొని సినిమాని ప్రారంభిస్తాం. కానీ సినిమా ముగిసే సమయానికి ఈ సినిమాకి నిజమైన హీరో ‘ఐశ్వర్య రాజేష్’ అని అర్ధం అవుతుంది. అంత గొప్పగా ఆ పాత్రని రాసాడు విరుమాండి అలాగే అంత గొప్ప నటన కనబరిచింది ఐశ్వర్య.
ఈ సినిమా ముగిశాక ‘అరియనాచి’ (సినిమాలో ఐశ్వర్య పాత్ర పేరు) మన మైండ్ లోంచి హార్ట్ లోంచి వెళ్ళదు. తన పాత్ర ద్వారా ఐశ్వర్య అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అంటే అతిశయోక్తి కాదు. పరాయి దేశం వెళ్లి అక్కడ చనిపోయిన తన భర్త శవం కోసం చేసే ప్రయత్నం ఈ సినిమా. గల్ఫ్ దేశాలకి వెళ్లిన మన వాళ్ళ పరిస్థితులు, అక్కడ కార్పొరేట్ కంపెనీలు చేసే మోసాలు, వారి కుటుంబ సభ్యుల బాధలు, గవర్నమెంట్ ఆఫీసుల్లో జరిగే పనులు, ఊళ్లలో నీళ్ల కష్టాలు.. ఇలా రకరకాల అంశాలని ఈ సినిమాలో టచ్ చేసాడు డైరెక్టర్. యదార్థ సంఘటనల ఆదారంగా ఒక సినిమాని ఎంత గొప్పగా, ఎంత ఖచ్చితంగా చూపించచ్చో తమిళ్ సినిమా వాళ్ళు ఇదివరకే చాలా సినిమాల్లో చూపించారు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. దాదాపు మూడు గంటల సినిమా ఓటీటీ లో చూస్తున్నప్పటికీ అలా కట్టిపడేస్తాడు. ఇది ఒక సినిమా చూస్తున్నాం అనేకన్నా మనకి తెలిసిన ఊర్లో మనకి తెలిసిన వారి కథ చూస్తున్న ఫీల్ కలుగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మనం పురాణాల్లో వైతరణి వద్దకి వెంటాడి వేటాడి తన భర్తని కాపాడుకున్న సావిత్రి గురించి తెలుసు.. అలాంటి ఒక ఇల్లాలు ప్రస్తుత జెనెరేషన్ లో ఉంటే ఎలా ఉంటుంది అనే పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది.