హైదరాబాద్ : నిన్న విడుదల అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా, ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ మరియు డిస్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది.
పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఎంసెట్ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు. కాగా, తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను మంగళవారం హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ నెలలో 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజ నీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,43,326 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 89,734 మంది (75.20 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు.