దుబాయ్: సన్‌రైజర్స్ ఐపీఎల్‌లో తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 భారీ స్కోరు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో ఐపీఎల్ లో రెండవ సెంచరీ చేజార్చుకోగా, వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది.
హైదరాబాద్ బ్యాటింగ్ లో రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్‌స్టో తన దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్‌లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్‌స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్‌స్టో, ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ మాత్రమె. తొలి బంతినే కవర్‌డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ విజయం వారి వైపు రాలెదు.