అబుదాబి: కింగ్స్ పంజాబ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దక్కింది. కోల్కత్తా విసిరిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో కింగ్స్ పంజాబ్ గెలుపు చివరి అంచుల వరకూ వచ్చి పరాజయం పొందింది. ఈ హోరాహోరి ఆటలో రెండు పరుగుల తేడాతో కింగ్స్ పంజాబ్ ఓడి పోయింది.
నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన కింగ్స్ పంజాబ్ 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేఎల్ రాహుల్(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. కింగ్స్ పంజాబ్‌కు 14 పరుగులు అవసరమైన తరుణంలో రాహుల్ అవుట్ కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 19 ఓవర్ ఆఖరి బంతికి రాహుల్‌ను ప్రసిద్ధ్ క్రిష్ణ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయిపోయింది.
చివరి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ రెండు ఫోర్లు కొట్టినా ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వేసిన సునీల్ నరైన్ 11 పరుగుల్చి వికెట్ తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఓటమి పాలుకావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని మరొకసారి బయట పెట్టింది. ఆఖరి బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టడంతో రెండు పరుగుల తేడాతో పరాజయం చెందింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు సాధించగా, నరైన్ రెండు వికెట్లు తీశాడు.