దుబాయ్: బౌలింగ్ పిచ్ పై బౌలర్లు నిప్పులు చెరిగేచోట కోహ్లి బ్యాట్ భయంకరంగా గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు విజయం అందించాడు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 37 పరుగులతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది.
తొలిగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. దేవ్‌దత్ పడిక్కల్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. బౌలింగ్ లో మోరిస్ 3, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు.
బౌలింగ్ పిచ్ అవడంతో బెంగళూరు ప్రతి పరుగుకు చాలానే కష్టపడింది. పవర్ ప్లే (6 ఓవర్లు)లో కేవలం 36 పరుగులే చేసిన ఆర్‌సీబీ జట్టు ఆలస్యంగా 8వ ఓవర్లో 50 పరుగులు చేసింది. అలాగని వికెట్లను టపాటపా కోల్పోలేదు. ఓపెనర్ ఫించ్ (2) ఒక్కడే ఔటయినప్పటికీ తొలి సిక్స్ పదో ఓవర్లో వచ్చింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఆ సిక్సర్ కొట్టాడు. అలాగని ఫోర్లు బాదారనుకుంటే పొరపాటు. పడిక్కల్, కోహ్లి కలిసి ఈ 10 ఓవర్లలో కొట్టిన బౌండరీలు కూడా నాలుగే! మరుసటి ఓవర్లో దేవ్‌దత్‌తోపాటు డివిలియర్స్ (0)కూడా ఔటయ్యాడు.
కోహ్లి నిదానంగా ఆడితే 30 బంతుల్లో 34 (2 ఫోర్లు), అదే కోహ్లి బాదితే 52 బంతుల్లో 90 నాటౌట్ (4 ఫోర్లు, 4 సిక్స్‌లు). 17వ ఓవర్లో దూబే, కోహ్లి చెరో ఫోర్ కొట్టారు.ఆ ఫోర్‌తో కోహ్లి 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయ్యింది. శార్దుల్ వేసిన ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ చుక్కలు చూపించింది. సామ్ కరన్ బౌలింగ్‌లో దూబే మొదట సిక్స్ బాదాడు. తర్వాత కోహ్లి లాంగాన్, స్క్వేర్ లెగ్‌ల మీదుగా రెండు సిక్సర్లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి.
19వ ఓవర్లో మరో సిక్స్ లాంగాన్‌లో పడింది. 20వ ఓవర్లో బౌండరీ ఒక్కటే కొట్టినా చకచకా బంతికి రెండేసి పరుగులు తీశాడు. ఈ 2 ఓవర్లలో 14 చొప్పున పరుగులు రావడంతో బెంగళూరు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చివరి 6 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు సాధించింది. ఇందులో 56 పరుగులు కోహ్లివే.
పిచ్ పరిస్థితులను గుర్తెరిగిన బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో చెన్నై పరుగులు చేయడంలో బెంగళూరు కంటే వెనుకబడిపోయింది. తొలి 5 ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (8) వికెట్‌నూ కోల్పోయింది. తర్వాత వాట్సన్ (14) కూడా చేతులెత్తేశాడు. 10 ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. ఇందులో ఏ ఒక్క ఓవర్లోనూ పట్టుమని 10 పరుగులైనా చేయలేకపోయింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ కొట్టారు.