న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఆర్థిక విభాగంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరద్దరిని ఈ ఏడాది ఈ పురస్కారం వరించింది.
వేలం ప్రతిచోటా ఉంది. అది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పాల్ మిల్గ్రామ్, రాబర్ట్ విల్సన్ వేలం సిద్ధాంతాన్ని మెరుగుపరిచారు కొత్త వేలం ఆకృతులను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని అకాడమీ వ్యాఖ్యానించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను ఆవిష్కరించిన పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రకటించారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రదానం చేయగా వీరిలో భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ ఉన్న సంగతి తెలిసిందే.