న్యూఢిల్లీ: రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేల రూపయల వేతన అడ్వాన్స్‌ను, ఎల్‌టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది.
దానితో పాటు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కూడా కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. ఎల్‌టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇందులో ఎల్‌టీసీ, వేతన అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.