అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్ఓపీని (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
మున్సిపాలిటీ లోని ఉద్యోగులందరికీ జీత భత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్ నిర్వహణ పక్కాగా జరగాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులను శుభ్రం చేయాలి. డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలి. ఇందుకోసం స్వల్ప మొత్తంలో యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు.
మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వ్యయం ఎంత? జీతాల కోసం, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించండి. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఎస్ఓపీ ఉండాలన్నారు.
ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.