న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కంటికి కనిపించని ఆ వైరస్ సోకిన వారి సంఖ్య ఆదివారం నాలుగు కోట్లకు చేరింది. ఇప్పటిదాకా దీని బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్లు మించిపోగా, మృతి చెందిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది.
కేవలం పది నెలల కాలంలోనే ఒక వైరస్ 200కు పైగా దేశాల్లో నాలుగు కోట్ల మందికి సోకడం చరిత్రలో ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా అత్యధిక కేసులతో ముందుంటే ఆ తర్వాత స్థానం భారతదేశానిదే. బ్రెజిల్, రష్యా, స్పెయిన్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది చైనాలోని వూహాన్‌లో బట్టబయలైన కరోనా వైరస్ జన్యుపరంగా అధికంగా మార్పులు చెందుతూ వస్తోంది.
దీంతో ఈ వైరస్‌కి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చాలా దేశాలు విజయవంతమయ్యాయి. అయినప్పటికీ ఆర్థిక రంగం, ఆరోగ్య రంగం మధ్య సమతుల్యత పాటించడంలోనూ, కలసికట్టుగా వైరస్‌పై పోరాడడంలోనూ ప్రపంచదేశాలు విఫలం అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టే పట్టి యూరప్ దేశాల్లో మళ్లీ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. చలికాలంలో ఆ ప్రాంతంలో వైరస్ రెట్టింపు వేగంతో విజృంభిస్తోంది. యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, తదితర దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. యూకేలో ఏకంగా 40శాతం కేసులు పెరిగిపోయాయి.
యూరప్ వ్యాప్తంగా సగటున రోజుకి లక్షా 50 వేల కేసులు నమోదవుతుంటే, ఒక్కో దేశంలో రోజుకి సగటున 7 వేల నుంచి 15 వేల వరకు కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. లండన్, పారిస్ మహా నగరాల్లో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదు కావడంతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి.