హైదరాబాద్: హైదరాబాద్‌లో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పంపిణీని మంగళవారం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదలతో ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు మరియు ఇతర మౌలికవసతులకు యుద్ధప్రాతి పదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ సాధారణ జనజీవన పరిస్థితులు త్వరగా నెలకొల్పాలని సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణమే విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘గడిచిన వందేళ్లలో ఎన్నడూ రానంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లోని వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభు త్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడంకన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.