హైదరాబాద్: తెలంగాణలో వర్ష భీభత్సం మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. హైదరాబాద్ మహా నగరం ఒక సముద్రాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసిన నీళ్ళు, అపార్ట్మెంటుల్లో నీళ్ళు, ఇళ్ళలోకి నీల్లు వచ్చి ప్రజలు నిత్యావసరాలు తడిసిపోయి ఆహారానికి కూడా ఇబ్బంది పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, ఇంకా జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు.
మంత్రి సబితా ఆదేశాల మేరకు యూనివర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. దసరా పండుగ తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని జేఎన్‌టీయూ హైదరాబాద్ ఒక ప్రకటనలో వెల్లడించింది.