హైదరాబాద్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)) ఉత్తీర్ణతా వ్యాలిడిటీని శాశ్వతం చేసినట్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి ప్రకటించింది. ఇప్పటిదాకా టెట్ వ్యాలిడిటీ కేవలం ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటులో ఉండేది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ నెలలో జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు పదే పదే టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్‌సీటీఈ భావిస్తోంది.
2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది.