హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక అనారోగ్య రీత్యా కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి, దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. ఆయనకి నలుగురు మనవళ్లు.
ఆయన గురించి చెప్పాలంటే, భోళామనిషి, సోషలిస్టు భావాలు, సాదాసీదా వ్యక్తిత్వం, ఏదైనా మొఖానే మాట్లాడే తత్వం ఆయన సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు.
2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ నుంచి టీఆర్‌ఎస్ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు.