హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సీజన్లో అమెజాన్ ఫ్లిప్ కార్ట్ ల వ్యాపారం అదిరింది. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా అక్టోబరు 15-19 మధ్య జరిగిన అమ్మకాలు ఏకంగా రూ.22,000 కోట్లు నమోదయ్యాయి. పలు బ్రాండ్లు, విక్రేతలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ కంపెనీల ద్వారా జరిపిన అమ్మకాలపై రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో తొలి అయిదు రోజుల విక్రయాలు గణనీయంగా జరిగాయి.
అందుబాటు ధరలో ఉత్పత్తులు, మొబైల్స్ విభాగం మెరుగైన పనితీరు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో బలమైన వృద్ధి వంటి అంశాలు లాక్‌డౌన్ తదనంతరం బ్రాండ్స్, విక్రేతల రికవరీకి కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఈ–కామర్స్ సంస్థలు దాదాపు రెండింతల సేల్స్‌తో రూ.51,590 కోట్ల విలువైన వ్యాపారం చేసే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఇది రూ.28,500 కోట్లు.
ఈ-కామర్స్ కంపెనీలు అధిక వ్యాపారం చేసేది ఇలాంటి ఫెస్టివల్ సీజన్లలోనే. ఈ సమయంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నందున ఇందుకు తగ్గట్టుగా సామర్థ్యం పెంపునకు ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడి చేశాయని రెడ్‌సీర్ వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబరు 16న ప్రారంభమైంది. నెలరోజుల పాటు ఇది సాగనుంది. తొలి 48 గంటల్లో దేశవ్యాప్తంగా 1.1 లక్షల మంది విక్రేతలు ఆర్డర్లను స్వీకరించారని అమెజాన్ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబరు 16-21 మధ్య, స్నాప్‌డీల్ తొలి సేల్ 16-20 మధ్య జరిగింది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ అక్టోబరు 16-22 మధ్య నిర్వహిస్తోంది. 80 శాతం మంది కస్టమర్లు స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లను, 20 శాతం మంది అంతర్జాతీయ బ్రాండ్లను ఎంచుకున్నారని స్నాప్‌డీల్ తెలిపింది. గతేడాది ఇది 65:35 శాతంగా ఉందని వివరించింది. టాప్–5 నగరాల వెలుపల ఉన్న విక్రేతలు 70 శాతం ఆర్డర్లను స్వీకరించారని స్నాప్‌డీల్ వెల్లడించింది.