టాలీవుడ్: కరోనా వల్ల దాదాపు ఒక ఏడు నెలలుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంది. షూటింగ్ లు లేవు, సినిమా విడుదలలు లేవు, ప్రారంభోత్సవాలు లేవు, థియేటర్ లు లేవు, ప్రీ రిలీజ్ వేడుకలు లేవు.. ఇలా సినిమాకి సంబందించిన ఎలాంటి హడావిడి ఏమి లేకుండా పోయిన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మెల్ల మెల్లగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు ప్రారంభం అయ్యాయి. ఇన్నిరోజులు కథల మీద, స్టోరీ డిస్కషన్స్ పైన పని చేసిన హీరోలు డైరెక్టర్లు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నారు.
ఈరోజు దసరా సందర్భంగా చాలా కొత్త సినిమాలు, కొత్త కాంబినేషన్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అప్పట్లో ఒకడుండేవాడు డైరెక్టర్ ‘సాగర్ కె చంద్ర’ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. నాగ చైతన్య , మనం డైరెక్టర్ ‘విక్రమ్ కె కుమార్’ కాంబినేషన్ లో థాంక్యూ సినిమా ఇవాళ పూజ కార్యక్రమాలు చేసుకొని వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కీరవాణి తనయుడిగా ‘మథు వదలరా’ ద్వారా పరిచయం అయిన ‘శ్రీ సింహ’ తన రెండవ సినిమాని ‘మణికాంత్.జె’ అనే దర్శకుడి కథతో రాబోతున్నాడు. ఈ సినిమాని ఇవాళ ఎస్ ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టి ప్రారంభించాడు.
శర్వానంద్ మరియు రష్మిక మందన్న జోడీ గా ‘నేను శైలజ’ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్’ అనే సినిమా కూడా ఈరోజు ప్రారంభం అయింది. గుడ్ సినిమా గ్రూప్స్ అనే సంస్థ ‘క్రేజీ అంకుల్స్, ‘గోదారి కథలు’, ‘నలుగురితో నారాయణ’, ‘గోల్డ్ మాన్’ అనే నాలుగు చిన్నసినిమాలు ఇవాళ ప్రకటించింది. ‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న, రియల్ స్టార్ తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోలుగా రూపొందుతున్న ‘కోటి కొమ్మచ్చి’ అనే సినిమా కూడా ఈరోజూ షూటింగ్ ప్రారంభించింది. ఇలా విజయ దశమి పురస్కరించుకొని చాలా సినిమాలు సినిమా ఇండస్ట్రీ పూర్వ వైభవానికి నాంది పలికాయి