న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుండి రక్షణకు భారత బయోటెక్ తయారు చేస్తున్న టీకా కోవాగ్జిన్ మూడో దశ మానవ ప్రయోగాలు త్వరలో ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25–26 వేల మందిపై ఈ టీకా ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశంలో ఎక్కువగా కోవిడ్ కేసులు ఉన్న ప్రాంతాలు, సమర్థత తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడో దశ మానవ ప్రయోగాలను నిర్వహిస్తున్నామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ ఓ ఇంగ్లిష్ పత్రికకు తెలిపారు. 25కు పైగా పట్టణాల్లో ఈ ప్రయోగాలు జరగవచ్చునని చెప్పారు.
కోవాగ్జిన్ టీకా తయారీలో పూర్తి బాధ్యత మొత్తం భారత్ బయోటెక్దేనని, టీకా కొనుగోలు కోసం కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని ఆయన తెలిపారు. కానీ, ఇప్పటికే కొన్ని డోసులను తయారు చేసి ఉంచామని తెలిపారు. ఏడాదికి 15 కోట్ల టీకా డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉండగా దీన్ని 50 కోట్ల డోసులకు పెంచేందుకు హైదరాబాద్, మరో చోట ఫ్యాక్టరీలను సిద్ధం చేస్తున్నామన్నారు.
టీకాలను భద్రపరిచే శీతల వ్యవస్థలు హైదరాబాద్, బెంగళూరు, అంకాలేశ్వర్లలో ఉన్నాయన్నారు. తమ టీకా కొనుగోలుకు 20 దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.