న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ ఐపీఎల్ సీజన్ ఏ మాత్రం కలిసిరాలేదు. టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరమవడం లాంటివి జరిగాయి. వరుస ఓటములు ధోని సేనను వెంటాడాయి.
పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు ముందు చెన్నై టీం చేతులెత్తేసింది. దీంతో ఐపీఎల్- 2020 సీజన్లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్కే నిలిచింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్ లీగ్ దశలోనే వెనుదిరగడం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎమ్మెస్ ధోని, జట్టు ఆటతీరుపై సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ధోని ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదని, జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ మరికొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ముంబై ఆటగాళ్లు హార్లిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో సహా రాజస్తాన్ జట్టు ప్లేయర్ జోస్ బట్లర్‌కు ధోని తన జెర్సీని బహూకరించిన నేపథ్యంలో, కెప్టెన్ కూల్ త్వరలోనే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇలాంటి తరుణంలో సీఎస్కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త అందించారు. ఐపీఎల్ 2021 సీజన్లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘2021లో కూడా ధోనినే జట్టును ముందుండి నడిపిస్తారు.
అవును, కచ్చితంగా ఇదే జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీలో అతడు, మాకు 3 సార్లు టైటిళ్లు అందించాడు. జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇలాంటి ఒక చేదు అనుభవం కారణంగా ప్రతీ విషయంలోనూ మార్పులు చేయాల్సిన పనిలేదు. అయితే ఒక మాట వాస్తవం.
ఈసారి మా స్థాయికి తగ్గట్టు అస్సలు ఆడలేకపోయాం. గెలిచే మ్యాచ్‌లను కూడా చేజార్చుకున్నాం. సురేశ్ రైనా, హర్భజన్ లేకపోవడం, కోవిడ్ కేసులు వెంటాడటం తీవ్ర ప్రభావం చూపాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.