హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’ పోర్టల్‌ను గురువారం రైతు ముంగిట్లోకి తీసుకురానుంది. అధికార అంచెల్లో, అధికారాల్లోనూ కోత విధిస్తూ రూపొందించిన భూ హక్కులు, పాస్ పుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) నేటి నుంచి ఉనికిలోకి వస్తుంది.
ఏళ్ళుగా కొనసాగిన మాన్యువల్ రికార్డులకు ముగింపు పలుకుతూ, ఇక పై డిజిటల్ ఆధారిత భూ రికార్డుల నిర్వహణకు నడుం బిగించింది. అవినీతి వేళ్లూనుకున్న రెవెన్యూ శాఖను సమూలంగా సంస్కరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్వోఆర్ 1971 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూలో ప్రజలకు సులభతర సేవలందించే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి కేవలం కంప్యూటర్ ఆధారిత భూ రికార్డులను మాత్రమే నిర్వహించే రెవెన్యూశాఖ, మ్యాన్యువల్ రికార్డుల నిర్వహణ నుంచి తప్పుకోనుంది. పహానీ నకలును పొందేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సిబ్బంది చేతులు తడిపితే కానీ రికార్డు చేతికందేది కాదు. ఈ పరిస్థితి నుంచి రైతులకు ఊరట కలుగనుంది. ఆన్లైన్లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలు కలుగనుంది.
ప్రస్తుతం భూ హక్కులు పొందినా, రికార్డులకెక్కడానికి 2 నుంచి 6 నెలల సమయం పడుతోంది. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీలో జరిగే జాప్యానికి ‘ధరణి’తో ముగింపు పడనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే నిర్వహిస్తుండడం, అక్కడికక్కడే రికార్డుల అప్డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్ ప్రక్రియ కూడా అర గంటలొనే పూర్తి కానుంది. ధరణి దేశానికే దిక్సూచిలా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.