టర్కీ : పశ్చిమ టర్కీ, గ్రీస్ దేశ సరిహద్దులలో శుక్రవారం భారీగా భూమి కంపించింది. అయితే ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. భూకంపం దాటికి ఆరు భవనాలు కూలడంతో పాటు, సెంట్రల్ ఇజ్మీర్‌లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విపత్తు వల్ల పలువురు మరణించారని, ప్రాణనష్టం అధికంగానే ఉండే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది.
భూకంపం దాటికి ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించడంతో ఇజ్మీర్ పరిధిలోని సమోస్ తీర ప్రాంతానికి సముద్రం చొచ్చుకొచ్చింది. ఇజ్మీర్ పక్కనున్న ఏజియన్ సముద్రంలో 16 కి.మీ లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఈ భూకంపం వచ్చిన కారణంగా సంభవించిన సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్నిచోట్ల బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలంతో వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సహా పలు ప్రాంతాలలోనూ ఈ భూకంపం సంభవించింది