బెంగళూరు: తనకు రావల్సిన పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటవీశాఖలో అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కలత చెందారు. బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను అక్కడ అందజేశారు.
తాజాగా జరిగిన పదోన్నతుల్లో అమర్‌కుమార్‌పాండేను శాంతిభద్రతల అదనపు డీజీపీ పోస్టు నుంచి డీజీపీ– పోలీస్ శిక్షణ విభాగానికి, టీ.సునీల్‌కుమార్‌ను ఏసీబీ ఏడీజీపీ నుంచి సీఐడీ ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం డీజీపీగా, సీహెచ్.ప్రతాప్‌రెడ్డికి ఏడీజీపీ– పోలీస్ సంబంధాలు, ఆధునీకరణ, శాంతిభద్రతల విభాగం బాధ్యతలను అప్పగించారు.
రాజీనామాపై విలేకరులతో రవీంద్రనాథ్ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగానికి బుధవారం రాత్రి రాజీనామా చేశాను. నా కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేను. పోలీస్‌శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం చాలా సామాన్యం. కానీ వీటన్నింటిని భరిస్తూ ఉండలేను. ఈ తప్పులపై పోరాడాలి. డీజీపీకి నాకంటే రూ.300 వేతనం అధికంగా వస్తుందంతే. అయితే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించా అని చెప్పారు.