వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికా దేశాల వెన్నులో కరోనా మహమ్మారి తీవ్ర వణుకు పుట్టిస్తోంది. సెకండ్ వేవ్‌లో మొదటి సారి కంటే అత్యంత భయంకరంగా ఈ వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా యూరప్ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి.
ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్‌డౌన్ ప్రకటించారు. పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై కూడా దేశంలో లాక్‌డౌన్ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ యూరప్ దేశాల్లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు ఇలానే ఉండే అవకాశాలున్నాయని యూకే సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ (ఎస్‌ఏజీఈ) అంచనా వేసింది. కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు పరచకపోతే పరిస్థితి మరింత దెబ్బతింటుందని బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
యూరప్ దేశాల్లో కోవిడ్ తొలి దశ ముగిసాక ఆ దేశాలన్నీ బాగా రిలాక్స్ అయ్యాయి. వైరస్ మళ్లీ విజృంభిస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వాలు ఏ మాత్రం రచించలేదు. కరోనా సోకిన రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్‌లో అంత పకడ్బందీగా అమలు కాలేదని తెలుస్తోంది.
గత వేసవిలో యూరప్ ప్రజలు కూడా ఇష్టానుసారం బయట తిరిగారు. అతిగా ప్రయాణాలు చేయడం, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం, క్లబ్బులు పబ్బులు, బీచ్‌ల వెంట తిరగడం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ గాలికి వదిలేశారు. దీంతో అక్టోబర్‌లో మళ్లీ కరోనా విజృంభించడం మొదలైంది.