వాషింగ్టన్: అమెరికాలో మరికొద్ది గంటల్లో అధ్యక్ష ఎన్నికలు, నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒక వైపు, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ మరో వైపు. విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా, కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్ అన్నింటి సారాంశం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు వాకిట్లో ఉన్నారని, అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు.
గత 2016లో హిల్లరీ క్లింటన్ దాదాపు అన్ని నేషనల్ ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కంటే ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం కూడా జో బైడెన్‌దే పైచేయిగా తేలింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ (52%), ట్రంప్ (43%) మధ్య తొమ్మిది శాతం ఓట్ల అంతరం ఉంది. గత ఎన్నికల్లో ఈ అంతరం ఒకట్రెండు శాతానికి మించలేదు.
యూఎస్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా, ఎవరికి ఎన్ని ఓట్లు ఏయే రాష్ట్రాల్లో పడ్డాయన్నదే చాలా కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్‌కు పాపులర్ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్‌కు 303 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు.