వాషింగ్టన్ : ప్రపంచంలో అన్ని దేశాలు ఎంతో ఉత్కంఠబరితంగా ఎదురు చూస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కాసెపటి కిందే మొదలైంది. భారత కాలమాన ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారభమైంది. న్యూ హాంప్షైర్లో తొలి ఓటు నమోదైంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు ముందస్తు జాగ్రత్తల మధ్య ఈ పోలింగ్ కొనసాగుతోంది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో దాదాపు సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హవాయ్, టెక్సాస్, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలయ్యాయి. ఈ పోస్టల్ ఓట్లపై రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం తీవ్ర అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. మరోవైపు ముందస్తు ఓటింగ్ భారీగా జరగడంతో విజయంపై బైడెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి అమెరికన్ ఓటర్లు జాతీయవాదానికే తిరిగి జై కొడతారా ? లేక ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా? అనేది ఇంకా వేచి చూడాలి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ బరిలో నిలిచారు.