హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ‘సెకండ్ వేవ్’ దడ మొదలైంది. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఈ వైరస్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న సమస్యలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను కూడా పటిష్ఠంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది.
కరోనా తాజా మార్గదర్శకాలు:
- సెకండ్ వేవ్ ఏ క్షణానైన విజృంభించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు ఎక్కువ రాకపోవడమే శ్రేయస్కరం. పండుగలు, శుభకార్యాలు ఏవైనా అందరూ ఒకేచోట చేరడం మంచిది కాదు. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవాలి.
- చలికాలంలో డెంగీ, మలేరియా సహా ఫ్లూ జ్వరాలతో కలిపి కరోనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఏమాత్రం లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు. కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
- సాధారణ లక్షణాలుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలి. అటువంటివారు ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. ఐసోలేషన్‌లో ఉండే గదికి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.
- ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించకూడదు.
- కూరగాయలు, పండ్లను బేకింగ్ పౌడర్ కలిపిన నీటితో కడగాలి. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి.
- పసుపు వేసిన వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి.
- ఇంట్లో ఖాళీగా ఎవరూ కూర్చోకూడదు, అంటే ప్రాణాయామం, ధ్యానం చేస్తుండాలి.. సంగీతం వినడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడమూ చేయాలి.