దుబాయ్: ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొదలైన ఐపీఎల్–2020 ఎట్టకేలకు లీగ్ దశను దాటి ప్లే ఆఫ్స్‌కు చేరింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఈ తొలి క్వాలిఫయర్ లో పరాజయం పలైన టీం రెండో క్వాలిఫయర్ విజేత తో మరొక సారి ఆడి ఫైనల్ కు వెళ్ళే అవకాశం ఉంది. ఇది లీగ్ దశలో రెండో స్థానంలో ఉండే జట్టు కు ఉన్న ఒక వరం.
మొదటి సీజన్ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా ఉన్నా, లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం.
ఈ సీజన్లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది.