చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. ప్రజలను, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా బుధవారం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు.
తమిళనాడుకు గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చెన్నై లో ఎడతెరిపి లేకుండా మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్విచక్రవాహనాలు పూర్తిగా మునిగిపోగా, కార్లలో ప్రయాణించే వారు కూడా జలప్రవాహాన్ని దాటేందుకు కష్టపడ్డారు.
బుధవారం ఆఫీసులకు, విధులకు వెళ్లే సమయంలో కూడా కుండపోత వర్షం వల్ల రోడ్లలో నడుములోతు వరద ప్రవాహంతో ప్రజలు నానాయాతన పడ్డారు. వాహనాలు ముందుకు సాగే వీలులేకపోవడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి కనిపించింది. బెంగళూరులో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చెన్నై నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి.