దుబాయ్ : విరాట్ కోహ్లి క్రికెట్ ప్రపంచానికి, అభిమానులకి ఒక పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా సేవలందిస్తున్న విరాట్ కోహ్లి నేడు 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌గా అధ్బుతమైన రికార్డులు సాధించిన కోహ్లి కెప్టెన్‌గా కూడా విజయవంతమైన బాటలో నడుస్తున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో ఉన్న కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి బుధవారం ఆర్సీబీ టీమ్ సభ్యుల సమక్షంలో కేక్‌ను కట్ చేశాడు.
కోహ్లి భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వచ్చే జనవరిలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నట్లు వారు ఇప్పటికే తెలిపారు. కాగా ఆర్సీబీకి మొదటిసారి ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాలనే కసితో ఉన్న కోహ్లికి ఆ కోరిక నెరవేరడానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచేందుకు ఆర్సీబీ సంసిద్ధం అవుతుంది.
విరాట్ కోహ్లి 2008లో తన కెప్టెన్సీలో అండర్ -19 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ వెంటనే 19 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎన్నికయ్యాడు. కెరీర్ మొదట్లో అడపాదడపా జట్టులోకి వచ్చిపోతున్నా, 2009 ఐసీసీ చాంపియన్స్ ట్రోపి అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ గాయంతో చాంపియన్స్ ట్రోపికి దూరమవడంతో కోహ్లికి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.
ఆ మ్యాచ్ లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం సాధించి పెట్టడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక అప్పటినుంచి కోహ్లికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కోహ్లి అంటే చేదనలో కింగ్ అనేలా మారిపోయాడు. విరాట్ వన్డేల్లో చేసిన సెంచరీలు ఎక్కువగా సెకెండ్ ఇన్నింగ్స్ లోనే వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఒక దశలో టీమిండియా చేదనకు దిగితే కోహ్లి ఉన్నాడంటే గెలుపు ఖాయం అనేంతలా తనదైన ముద్ర వేశాడు. 2012లో వైస్ కెప్టెన్‌గా ఎన్నికైన కోహ్లి 2014లో ఎంఎస్ ధోని నుంచి టెస్టు బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం 2017లో టీ20లతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గాను ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న కోహ్లి 248 వన్డేలు, 86 టెస్టులు, 82 టీ20లు ఆడాడు.