నెల్లూరు: భారత అంతరిక్ష పరిశొధనా సంస్థ అయిన ఇస్రో మరొక చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి ఈ నవంబర్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు.
ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా నింగిలోకి పది ఉపగ్రహాలను ఒకే సారి పంపనున్నారు. ఈఓఎస్-01 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ఈ శనివారం ప్రయోగించనుంది.
ఇప్పటికే ఇస్రో చైర్మన్ మరియు శాస్త్రవేత్తలు శ్రీహరికోట షార్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తల మినహా మిగతా ఎవ్వరినీ ఇస్రో అనుమతించడం లేదు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం.