దుబాయ్: ఐపీఎల్ లో నాలుగు సార్లు టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ మరో సారి టైటిల్ వేటకు అడుగుదూరంలో నిలిచింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో రోహిత్ గ్యాంగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
ఢిల్లీ పై గెలిచి ముంబై తుది బెర్తును ఖరారు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని ఏదశలోనూ కోలుకోనివ్వని ముంబై తనమార్కు ఆటతో చెలరేగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0)లను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపింది.
బౌల్ట్ వేసిన రెండు, ఐదు బంతులకు వారిద్దరూ ఔట్ కావడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి ధావన్ కూడా డకౌటయ్యాడు. వరుసగా ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌లుగా నిష్క్రమించడంతో ఢిల్లీ ఇక తేరుకోలేకపోయింది.
పరుగుల ఖాతా తెరవకనే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ చెత్త రికార్డును కూడా తన పేరున నమోదు చేసింది. స్టోయినిస్(65; 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించాడు. కాగా, బుమ్రా వేసిన 16 ఓవర్ తొలి బంతికి స్టోయినిస్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా, అదే ఓవర్ మూడో బంతికి సామ్స్‌ను ఔట్ చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 201 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డీకాక్(40; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్(51;38 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), ఇషాన్ కిషన్(55 నాటౌట్; 30 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్స్‌లు)లు రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకోవడంతో ముంబై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ముంబై ఇండియన్స్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది.