వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77) విజయం సాధించారు. బైడెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు.
ఇక్కడ గెలవడంతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ ఖాతాలో జమయ్యాయి. ‘జోసెఫ్ ఆర్.బైడెన్ జూనియర్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ట్రంప్ హయాంలో వైట్ హౌస్లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు.