సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. పోటాపోటీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది.
1470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ గెలిచారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా, అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి వణుకు పుట్టించింది.
ఒకానొక సమయంలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి, ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి, సంచలన విజయాన్ని నమోదు చేసింది.
దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలు అవ్వగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ 62,773 ఓట్లతో విజయం సాధించరు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు.