హైదరాబాద్ : ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ నెలలో మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ గురువారం సమావేశమైంది.
ఆ పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కమీషన్, దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ఆలోచనలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
కాగా త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికకి ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
అయితే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో వార్డు విభజనలో అవకతవకలు జరిగినట్లు ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వార్డుల వారీగా ఈనెల 7న జారీచేసిన ఓటరు పట్టికలను పరిశీలిస్తే వార్డుల విభజన చట్టంలో పేర్కొన్న విధంగాలేదని ఆక్షేపించింది.
వార్డుల విభజనలో అసమతుల్యం కారణంగా ఆయా వార్డులకు బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలు భారీగా ఉండి ఆయా ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.