ముంబై: పబ్జీ మొబైల్ గేమ్ యూజర్లకు శుభవార్త. భారత దేశంలోని వినియోగదారుల కోసం కొత్త అవతారంలో ఈ గేమ్ తిరిగి అందుబాటులోకి రానుంది. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌గా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో దీన్ని త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు పబ్జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది.
భారతదేశంలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్‌ప్లేను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది.
పబ్జీ కార్పొరేషన్ మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్ ఇటీవల మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. అజ్యూర్ర్ క్లౌడ్‌లో యూజర్ డేటా స్టోర్ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారం వెల్లడించింది. అంతేకాదు గేమ్ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా కంపెనీ నియమించుకోనుంది.
‘పబ్జీ మొబైల్ ఇండియా’ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కాగా కరోనా వైరస్, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పబ్జీ సహా చైనాకు చెందిన యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో (అక్టోబర్ 30,శుక్రవారం) నుంచి భారత్‌లో పబ్జీ గేమ్‌ను సర్వీసులు, యాక్సెస్‌ను నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గేమ్ మళ్లీ భారతీయులకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి నెలకొంది.