వాషింగ్టన్: నూతన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తమ ప్రభుత్వ పాలనా అధికారుల నియామకంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్కు అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ బుధవారం బైడెన్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
అమెరికాలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అగ్రరాజ్య అధ్యక్షుడు రోజు వారీ కార్యక్రమాల్ని చూడాలి. ఆయనను అధ్యక్షుడి గేట్ కీపర్ అని కూడా పిలుస్తారు. ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఇతర సిబ్బంది నియామకంలో తనే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
‘‘నేను, రాన్ గత ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాం. 2009లో అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాం. 2014లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా మేము కలిసి కట్టుగా అధిగమించాం. వైట్ హౌస్ పదవికి ఆయనను మించిన వారు లేరు’’ అని బైడెన్ ట్రాన్సిజన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తనకున్న అపారమైన అనుభవం, అత్యంత సమర్థతతో మేమిద్దరం కలిసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కిస్తామని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. కాగా వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల కంటే తక్కువగా ఉన్న వారికి పన్ను పెంచబోమని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ధనవంతుల దగ్గర్నుంచి పన్ను వసూలు చేస్తామని ఒక ట్వీట్లో కమలా హారిస్ స్పష్టం చేశారు.