వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అలాస్కా రాష్ట్రంలో నెగ్గారు మరియు తాను అమెరికా అధ్యక్ష పదవిని విడిచిపెట్టేది లేదని చెబుతున్నారు. ఈ విజయంతో ఆయన ఖాతాలోకి మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో ట్రంప్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 217కి చేరుకుంది. ట్రంప్‌కి 56.9శాతం ఓట్లు వస్తే, అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 39.1శాతం ఓట్లు వచ్చాయి.
538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్‌కు ఇప్పటికే 279 ఓట్లు లభించాయి. అలాస్కా సెనేట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో 100 స్థానాలున్న సెనేట్‌లో ఆ పార్టీ బలం 50కి చేరుకుంది. మరోవైపు ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా, అధికార బదలాయింపు ప్రక్రియ క్లిష్టరతమౌతోన్న వేళ, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కి ప్రపంచ దేశాధినేతలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర విషయాలపై సహకరిస్తామని మద్దతు తెలుపుతున్నారు.
ఉత్తర కొరియాతో నెలకొన్న అణ్వాయుధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తానని జోబైడెన్ తెలిపినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే –ఇన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతని పెంపొందించడానికి దక్షిణ కొరియాతో భాగస్వాములమౌతామని బైడెన్ తెలిపారు.
తమ రెండు దేశాల మధ్య అణ్వాయుధ ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కాలంలో కృషి జరిగిందని, దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని మూన్ అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా బైడెన్‌ని కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా కూడా ఈ సందర్భంగా తెలిపారు.