హైదరాబాద్ : పండుగలు జరుపుకోవడం కంటే కూడా ప్రజల ప్రాణాలే తమకు చాలా ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో బాణసంచా కాల్చకుండా, విక్రయించకుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు తేల్చి చెప్పింది. ప్రజలెవరూ బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19వ తీదీన తమకు వివరించాలని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవంబర్ 10–30 మధ్య బాణసంచా కాల్చకుండా నిషేధం విధించేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాశ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది.
బాణసంచా కాలిస్తే వాయుకాలుష్యం ఏర్పడుతుందని, శ్వాసకోశ సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని ఇంద్రప్రకాశ్ వాదించారు. ఈ నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలన్నారు. బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ), కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు.
అనంతరం బాణాసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ ప్రసాద్ నివేదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు.