హైదరాబాద్: కరోనా కారణంగా థియేటర్ లు మూతపడి సినిమాలు ఓటీటీ బాట పట్టినా కూడా అన్నీ చిన్న సినిమాలే ఓటీటీలలో అందుబాటులోకి వచ్చాయి. సౌత్ నుండి ఓటీటీ లో విడుదలైన ఏకైక పెద్ద హీరో సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించిన సూర్య నటించిన ఈ సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది.
ఈ సినిమా మూల కథ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ యొక్క కథ. తాను అనుకున్నది సాధించే తత్వం ఉన్న వ్యక్తి కథ. తన ప్రయత్నంలో తండ్రి తో కూడా గొడవపడి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన తక్కువ ఖర్చు తో విమానయానం ఏర్పాటు చేయాలనీ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమం లో అతను ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన కష్టాలు అలాగే తనకి తోడు గా నిలిచిన వాల్ల చుట్టూ అల్లుకున్న కథ. కథనం విషయానికి వస్తే ఈ సినిమా చూస్తున్నంత సేపు కట్టిపడేస్తుంది. ఎక్కడా కూడా అతి అనిపించకుండా సెటిల్ రైటింగ్ కనిపిస్తుంది.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే ముందుగా అభినందించాల్సిన వ్యక్తి డైరెక్టర్ సుధా కొంగర. తాను అనుకున్న కథని అనుకున్నట్టుగా చాలా అద్భుతంగా, ఎమోషనల్ గా తెర మీదికి తీసుకు రాగలిగింది. తాను రాసుకున్న కొన్ని కొన్ని సీన్లు మాత్రం గూజ్ బమ్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్ కానీ ఇన్స్పిరేషనల్ సీన్ కానీ , వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ సీన్లు కానీ ప్రతీది ఆకట్టుకునేవిధంగా రచిందింది. ఈ సినిమాలో వచ్చే పాటలు కూడా ఎక్కడ కథ నుండి బయటకి వెళ్లకుండా పాటల్లో కూడా కథను చూపించి పెర్ఫెక్షనిస్ట్ అనిపించుకుంది డైరెక్టర్ సుధా. ఈ సినిమాకి సంగీతం అందించిన జి వీ ప్రకాష్ మరొకసారి తన మార్క్ చూపించాడు. ఇలాంటి కథకి సరైన సంగీతం అందించాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన నికేత్ బొమ్మిరెడ్డి తన పనితనం చాటాడు. చాలా చోట్ల అది గ్రాఫిక్స్ వర్క్ అని కూడా ఏర్పడకుండా పని చేసాడు. ఎడిటింగ్, రైటింగ్ తమ తమ విభాగాల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరొక విషయం హీరో కి చెప్పిన డబ్బింగ్. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా సక్సెస్ బాట పట్టినా ‘సత్యదేవ్’ ఈ సినిమాలో సూర్య కి చెప్పిన డబ్బింగ్ కరెక్ట్ గా కుదిరించి.
నటీనటుల విషయానికి వస్తే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. మామూలు గానే సూర్య తనలోని నటుడ్ని సంతృప్తి పరుచుకోవడానికి వివిధ పాత్రలు, ప్రయోగాలు చేస్తుంటాడు. అందులోనూ ఇలాంటి సినిమా తన చేతిలో పడితే ఇంక చెప్పడానికి ఏముంది. ఒక్క సీన్ చెప్పాలంటే తన తండ్రి హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయనని చూడడానికి ఎయిర్పోర్ట్ లో టికెట్ కొనే సీన్ లో సూర్య నటన చూస్తే అభినందించకుండా ఉండలేము. ఈ సినిమాలో మరో చెప్పుకోదగిన పాత్ర అపర్ణ బాలమురళి. సూర్య కి జోడీ గా ఈ అమ్మాయి నటన కూడా ఆకట్టుకుంది. పరేష్ రావల్, ఊర్వశి, మోహన్ బాబు.. ఇంకా మిగతా వాల్లు తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
చివరగా చెప్పాలంటే ఒక అద్భుతమైన కథని, ఎమోషనల్ జర్నీ ని ఎంతో ఎమోషనల్ గా రియలిస్టిక్ గా చెప్పిన ప్రయత్నంలో ఈ సినిమా సక్సెస్ కి ఆకాశమే హద్దు.