అమరావతి: ప్రపంచం మొత్త మీద కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ సంకేతాలు ఉన్నాయని, ఇప్పటికే పలు దేశాల్లో అది తీవ్రంగా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్తగా ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోందన్నారు.
ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కుడా అందరం జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్‌పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్–19 నివారణ, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- యూరప్ మొత్తం కోవిడ్ సెకండ్ వేవ్‌తో వణుకుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపిస్తోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్ విధించారు. అమెరికాలో కేసులు ఎక్కువయి తీవ్ర ఇబ్బంది పడుతోంది.
- ప్రపంచ దేశాలలో మొదలు కాగానే మనకూ వస్తోంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
- స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలపై శ్రద్ధ తీసుకోవాలి.
- ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
- రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాం. కొన్నిరోజుల క్రితమే 90 లక్షల మార్కును దాటేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1.7 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు తగ్గింది.