fbpx
Thursday, December 26, 2024
HomeTelanganaకోవిడ్ టెస్టులపై తెలంగాణ కు హైకోర్టు అక్షింతలు

కోవిడ్ టెస్టులపై తెలంగాణ కు హైకోర్టు అక్షింతలు

TS-HIGHCOURT-ASKS-GOVT-INCREASE-COVID-TESTS

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ‌ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కోవిడ్‌ టెస్టులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా జరుగుతున్నాయని, కోర్టులో కేసున్నప్పుడే పరీక్షలు పెంచి, తరువాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోవిడ్ కేసుల విషయంలో దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రోజుకు 50వేల కోవిడ్‌ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని, సమీప భవిష్యత్తులో ఈ సంఖ్యను లక్ష వరకు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా రెండో దశ ముప్పు రాష్ట్రంలో పొంచి ఉందన్న న్యాయస్థానం, భౌతికదూరం, మాస్కుల వంటి కరోనా మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఈ సందర్భంగా సర్కారును ఆదేశించింది.

దీనిపై స్పందించిన పీహెచ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మార్గదర్శకాలు పాటించేలా హైకోర్టు ప్రజలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రంలో కరోనా వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ గురించి కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఈనెల 24లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular