న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లాభాలు వచ్చాయి. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్‌కు గానూ బీసీసీఐ బోర్డుకు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.
అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్‌షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని తెలుస్తోంది. కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తాయి. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.
దాని తరువాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా అదీ సాధ్య పడలేదు. అందువల్ల ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. కానీ టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు, అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది.
ఇక కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో కూడా 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం సంపాదించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్‌షిప్ 25 శాతం వరకు పెరిగిందన్నారు.