అమరావతి : బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం ఇంకా బలపడి ఇప్పుడు అది వాయుగుండంగా మారింది. గత 6 గంటల్లో ఈ అల్పపీడనం వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ పాండిచేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీ. చైన్నైకి ఆగ్నేయ దిశగా 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారి, వాయువ్య దిశగా ప్రయాణించి, కారైకాల్, మహా బలిపురం, ప్రాంతాల మధ్య తీరాన్ని 25 నవంబర్‌న సాయంత్రం తీవ్ర తుఫానుగా గంటకు 100-110 కి.మీ. గాలి వేగంతో దాటవచ్చని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు అంటే ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై కుడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.