హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల వేదికగా హైదరాబాద్ లో బందో బస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల పేరిట పోలీసు, సాయుధ బలగాల కవాతులో రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులు కొత్త రికార్డు సృష్టించారు. ప్రతి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి కవాతులు, ఫ్లాగ్ మార్చ్ జరపడం అలవాటు.
కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వంలో సుదీర్ఘ ఫ్లాగ్‌మార్చ్‌ను మంగళవారం రోజు నిర్వహించారు. మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 5 కి.మీ. మేర ఈ ఎన్నికల ప్రత్యేక కవాతు జరిగింది. కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇంత దూరం జరగడం పోలీసు చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి.
కుషాయిగూడ, నేరేడ్మెట్, జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నాలుగు వార్డుల్లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ ఫ్లాగ్‌మార్చ్ జరిగింది. ఇందులో 129 మంది సివిల్ పోలీసులు, 212 మంది టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి. పోలీసు బ్యాండ్, అశ్వకదళాలు ఈ కవాతును ముందుకు నడిపించాయి.
స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఫ్లాగ్‌మార్చ్ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజల్లో నైతిక స్థైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫ్లాగ్‌మార్చ్‌లో మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.