ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారత ఐటీ దిగ్గజం యొక్క వ్యవస్థాపకులలో ఒకరు, టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఫకీర్‌చాంద్ కోహ్లి (97) ఇవాళ కన్నుమూశారు. 100 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ నిర్మాణానికి పునాది వేసిన కోహ్లిని “సాఫ్ట్‌వేర్ పరిశ్రమ పితామహుడు” అని కూడా పిలుస్తారు.
భారత్ లో టెక్నాలజీ విప్లవానికి పునాది వేసిన కోహ్లీ మరణంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐటీ రంగానికి అనేక చేసిన సేవలు ఎనలేనివని, దేశానికి చెందిన అనేక తరాల ఐటీ నిపుణలు కోహ్లికి రుణపడి ఉంటారంటూ కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఛైర్మన్ రామ్‌కుమార్ రామమూర్తి , మాజీ నాస్కామ్ చైర్మన్ గణేష్ నటరాజన్ సంతాపం తెలిపారు.
కోహ్లీ 1924 మార్చి 19 న పెషావర్ బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. పెషావర్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు మరియు లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ విజేత. 1950 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీజీ చేశారు. ఆగష్టు 1951 ప్రారంభంలో భారతదేశానికి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు ఎఫ్‌సీ కోహ్లీ. ఆ తరువాత 1970 లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీలకు డైరెక్టర్ అయ్యారు.
తరువాత 1968, ఏప్రిల్ 1న జేఆర్డీ టాటా మరియు ఎఫ్‌సీ కోహ్లీ టీసీఎస్‌ను స్థాపించారు. ముంబై కేంద్రంగా సేవలను అందిస్తూ తదనంతర కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. 1995-96 వరకు నాస్కామ్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం టీసీఎస్ ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్, సీఈవోగా రాజేష్ గోపినాథన్ ఉన్నారు.