అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా శనివారం ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుపానుపై ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు.
నివర్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 సహార్యం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఈ ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి పూర్తి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కావాల్సిన అన్ని సహాయ చర్యలూ చేపట్టాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.
వర్షాలు ముగిసిన అనంతరం పంట నష్టంపై త్వరితగతిన అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే, సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు.